ఉరవకొండ : వీరశైవ సంప్రదాయ తొలి గురువు Renukacharya జయంతి సందర్భంగా ఉరవకొండ పట్టణంలోని వీరశైవ కళ్యాణ మండపంలో ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ చెన్నకరిబసవ రాజేంద్రస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
“ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. వీరశైవ సంప్రదాయంలో తొలి జగద్గురువుగా గౌరవింపబడే రేణుకాచార్యులు శైవ ధర్మ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారని అన్నారు. పంచాచార్యులలో మొదటివారిగా ఆయన స్థానం ప్రత్యేకమని పేర్కొన్నారు.
సోమనాథ లింగం నుండి అవతరించిన దివ్యజ్ఞాని అనే విశ్వాసం సంప్రదాయంలో ఉన్నదని, దేశవ్యాప్తంగా పర్యటించి ఇష్టలింగ ధారణ, శివభక్తి ప్రచారానికి ఆయన చేసిన కృషి విశేషమని స్వామిజీ వివరించారు. కులవివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని బోధించడం, గురుభక్తి ప్రాముఖ్యతను చాటి చెప్పడం ఆయన బోధనల సారమని తెలిపారు.
వీరశైవ సంప్రదాయ పునాదులు వేసిన పంచాచార్యులలో రేణుకాచార్యులు, దారుకాచార్యులు, ఏకోరామాచార్యులు, పండితారాధ్యులు, విశ్వరాధ్యులు ఉన్నారని సభలో గుర్తుచేశారు. కర్ణాటకలోని రంభాపురి పీఠం ఈ సంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అఖిల భారత వీరశైవ మహాసభ ఉపాధ్యక్షురాలు పాటిల్ హేమావతి, నాగన్న గౌడ్, నిరంజన్ గౌడ్, మల్లికార్జున, దేశాయి గంగాధర్, యోగేష్ తదితరులు హాజరయ్యారు. మహిళా నాయకురాళ్లు సుశీలమ్మ, కొల్లి సుజాత, మంజులలత, హారతి, మమతతో పాటు జంగమ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
