ఏలూరు: ప్రజా నిధుల దుర్వినియోగంపై జిల్లా యంత్రాంగం కఠిన వైఖరి అవలంబించింది. టీ.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ పంచాయతీలో రూ.25.94 లక్షల నిధులు అక్రమంగా వినియోగించిన ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ కె. వెంకటేశ్వరమ్మ నుంచి ఆ మొత్తాన్ని తక్షణమే రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ పంచాయతీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనే ఈ అక్రమాలపై విచారణ జరిపి, సర్పంచ్ చెక్ పవర్‌ను ఆరు నెలలపాటు రద్దు చేసిన విషయం గుర్తు చేశారు. అయినప్పటికీ, దుర్వినియోగం చేసిన నిధుల రికవరీలో ఆలస్యం జరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం మరింత కఠినంగా స్పందించింది.
ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్త గుండె పాండురంగ పలు మార్లు అధికారులను ఆశ్రయించి ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 9న పీజీఆర్‌ఎస్ ద్వారా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు మళ్లీ పరిశీలనకు వచ్చింది. అనంతరం ఏపీ పంచాయతీ రాజ్ చట్టం-1994 ప్రకారం సర్పంచ్‌ను బాధ్యురాలిగా నిర్ధారిస్తూ కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 14న జారీ చేసిన నోటీసులో, దుర్వినియోగం చేసిన రూ.25.94 లక్షలను 15 రోజుల లోపు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలని స్పష్టమైన గడువు విధించారు. నిర్ణీత గడువులో చెల్లింపులు చేయకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
గ్రామాభివృద్ధికి వినియోగించాల్సిన నిధులు అక్రమంగా మళ్లించబడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతరులకు హెచ్చరికగా మారిందని పేర్కొంటున్నారు. వెంటనే నిధులు రికవరీ చేసి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.