తిరుమల : సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు, శ్రీ మలయప్ప స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారి వాహనసేవ ఆరంభం కాగానే భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో కీర్తనలు చేస్తూ ఉత్సవానికి శోభను చేకూర్చాయి. మంగళవాయిద్యాల గోల నడుమ వాహనం ముందుకు కదిలే సమయంలో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆరోగ్యప్రదాత సూర్యప్రభ వాహనం
సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. చంద్రుడుకూడా సూర్యుని తేజస్సుతోనే ప్రకాశిస్తాడని ఆధ్యాత్మికులు వివరిస్తున్నారు. ఈ వాహనసేవలో శ్రీమన్నారాయణుడే సూర్యప్రభ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంలో దర్శనం లభిస్తే భోగభాగ్యాలు, సత్సంతానం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
చంద్రప్రభ వాహనసేవ రాత్రి
మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు అనుగ్రహించనున్నారు.
ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
రేపు రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన అక్టోబర్ 1, బుధవారం ఉదయం 7 గంటలకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది.

