ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు – మంత్రి లోకేశ్ లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం – ఆర్డీటీ
అనంతపురం: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఒక సాధారణ స్వచ్ఛంద సంస్థ కాదని, లక్షలాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఆశాకిరణమని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆర్డీటీ సేవలకు తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినా, వాటిని శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సంప్రదించాం. ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది” అని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలతో ఆత్మీయ బంధం, మానవతా సేవా బంధం కలిగిన ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని లోకేశ్ పిలుపునిచ్చారు.