ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా జరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వైద్యులు రోగుల పట్ల అనుసరిస్తున్న తీరుపై సిపిఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"వైద్యుల దగ్గరికి వస్తే సగం జబ్బు నయం కావాలని అంటారు. కానీ ఇక్కడి వైద్య సిబ్బంది తీరు చూస్తే ఉన్న జబ్బు మాట దేవుడెరుగు, లేని జబ్బు తగిలించుకొని పోయే విధంగా ఉంది" అని సిపిఎం నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జ్వరంతో బాధపడుతున్న ఐదు సంవత్సరాల చిన్నారి మరణించిన ఘటనను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రైవేట్ క్లినిక్ లపై శ్రద్ధ: ప్రభుత్వ వైద్యంపై నిర్లక్ష్యం
ప్రభుత్వ వైద్యులు తమ సొంత ప్రైవేట్ క్లినిక్ లపై చూపే శ్రద్ధ ప్రభుత్వ వైద్యం అందించే దానిపై లేదని సిపిఎం ఆరోపించింది. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వెంటనే అనంతపురం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసే అధికారులు, చిన్నారి మరణం విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇక్కడి వైద్యులు రోగులను చేయి పట్టుకుని స్టెతస్కోపుతో పరీక్షించిన సందర్భాలు లేవని, కేవలం జ్వరం వచ్చిందంటే మాత్రలు మాత్రమే ఇస్తారని విమర్శించారు. రోగిని స్వయంగా చేయి పట్టుకుని చూసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.
సిపిఎం డిమాండ్స్:
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పలు డిమాండ్లను చేసింది:
* వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని తొలగించాలి.
* ఇప్పటినుంచైనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.
* డాక్టర్లందరూ అందుబాటులో ఉండాలి.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మధుసూదన్, ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు సీనప్ప, సిద్ధప్ప, రవికుమార్, రామాంజనేయులు, కౌలు రైతు సంఘం నాయకులు వెంకటేశులు, సుంకన్న, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment