ట్రూ టైమ్స్ ఇండియాసెప్టెంబర్ 30
గుత్తి/అనంతపురం: గుత్తి-గుంతకల్లు రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఐటీ జిల్లా అధ్యక్షుడు వై. రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరమ్మతులు చేయకుంటే త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గుత్తి పట్టణంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గుంతల రోడ్ల వల్ల ప్రమాదాలు
"గుత్తి పట్టణంలో గుంతల రోడ్ల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. చినుకు పడితే వాహనదారుల్లో వణుకు మొదలవుతుంది" అని రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో 'గుంతలు లేని రహదారులు' నిర్మిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడం దారుణమన్నారు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
బ్రిడ్జిల నిర్మాణం, శాశ్వత మరమ్మతులపై డిమాండ్
గుత్తి-గుంతకల్లు మధ్యనున్న శ్రీపురం, రజాపురం, మార్నేపల్లి, గొల్లలదొడ్డి, ధన్చర్ల, తిమ్మాపురం వద్ద బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో పలుమార్లు కోరినా పనులు ప్రారంభం కాలేదన్నారు. అలాగే, పత్తికొండ రోడ్డులో గుంతలు పెరిగిపోయాయని, బసినేపల్లి వద్ద గుంతలకు వేస్తున్న తాత్కాలిక మరమ్మతులు కేవలం నెల రోజులకే తిరిగి పాడవుతున్నాయని ఆయన వివరించారు.
నెల రోజుల్లో మరమ్మతులు చేయాలి
నెల రోజులలోపు రోడ్ల మరమ్మతులు చేపట్టకపోతే, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ వరదరాజులు, ఐటీ విభాగం నాయకులు జ్ఞానేశ్వర్ రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment