అనంతపురం:
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2024–2026 బి.పెడ్ (B.P.Ed) రెండవ సంవత్సరం 3వ, 4వ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలంటూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) అనంతపురం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు.
AIYF అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ మాట్లాడుతూ, SKU పరిధిలో ఉన్న విద్యార్థులు పరీక్షలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2024–26 బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీ (DSC) అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇప్పటికే ఆదికవి నన్నయ, విక్రమసింహపురి యూనివర్సిటీలు పరీక్ష తేదీలను ప్రకటించగా, SKU మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు.
విద్యార్థులు SKU అధికారులను సంప్రదించాలంటే కళాశాల ప్రిన్సిపాల్ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. “విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తామని, పరీక్షలు ఆలస్యం అవుతాయని ప్రిన్సిపాల్ భయపెడుతున్నారు,” అని కొట్రేష్ తెలిపారు.
ఈ పరిస్థితుల వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటనలు కూడా జరిగాయని అన్నారు.
SKU యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, వెంటనే 3, 4 సెమిస్టర్ పరీక్షలను నిర్వహించకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో AIYF జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు దేవ, నాయకులు సురేంద్ర, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment