అమరావతి:ట్రూ టైమ్స్ ఇండియా
ప్రస్తుత సమాజంలో పెద్దల నుంచి చిన్నారుల వరకు సిగరెట్లు, గంజాయి మత్తు, మద్యానికి బానిసలవుతున్నారు. యువత హాష్ ఆయిల్, మత్తు ఇంజక్షన్లు, డ్రగ్స్ అలవాటుపడుతున్నారు. ఇలాంటి వారిని మత్తుకు దూరంగా ఉంచే ప్రయత్నంలో కొంతమంది తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు. అంతర్లీనంగా ఏర్పడిన మానసిక పరిస్థితులతో తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం కూటమి ప్రభుత్వం వ్యసన విమోచన కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.
కూటమి ప్రభుత్వం కృషి: ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యసన విమోచన కేంద్రాల బలోపేతానికి రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జిల్లా, బోధనాసుపత్రుల్లో గల 21 కేంద్రాల్లో వైద్యపరికరాలు, మందులు, మౌళిక సదుపాయాల కల్పన, సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచడం, సిబ్బందికి ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. 21 కేంద్రాల ద్వారా వ్యసనాల బారిన పడినవారిని ఆ వ్యసనాల నుంచి బయటకు తెచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చెడు సహవాసాలు చేయవద్దని, ఆరోగ్య సంరక్షణ, విలువలు ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విమోచన కేంద్రాల ద్వారా వ్యసనాలకు గురైనవారికి నిపుణుల ద్వారా చికిత్స, ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం వ్యసనాలకు గురైనవారికి కొత్త జీవితం ప్రసాదించడమేనని తెలిపారు. 2023-24లో 18147 మంది ఇన్-పేషెంట్లు ఉండగా 2024 నుంచి సెప్టెంబర్ 2025 నాటికి 22909 మంది ఇన్-పేషెంట్లు ఈ కేంద్రాల ద్వారా సేవలు పొందారని గుర్తు చేశారు.
చంద్రబాబుకు కలెక్టర్ వినతి: అదే విధంగా విశాఖపట్నంలో మత్తుకు బానిసైన వారి సంఖ్య పెరగడంతో డి-అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. 4 సెంటర్లను అదనంగా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. కేంద్ర కారాగార సామర్థ్యం 950 మంది ఉండగా, గంజాయి కేసుల్లో వచ్చే ఖైదీలతో 2,000 మందితో జైలు నిండిపోయింది. గంజాయి కేసుల్లో వస్తున్న ఖైదీల్లోనూ యువత ఎక్కువగా ఉన్నట్లు హోంమంత్రి అనిత ఇటీవల వెల్లడించారు. కేంద్ర కారాగారం ఆధునికీకరణ నేపథ్యంలో ఇక్కడ ఒక డి-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. చిన్న వయసులో మత్తుకు అలవాటు పడితే వెంటనే తల్లిదండ్రులు గుర్తించి కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాలని, ఒంటరిగా వదిలిపెట్టకూడదని మానసిక వైద్యులు అంటున్నారు. వెంటనే డి-అడిక్షన్ కేంద్రానికి తీసుకురావాలని సూచిస్తున్నారు.

Comments
Post a Comment