
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లా, బిసాలి గ్రామపంచాయతీ ఝిరి మొహల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువలను మర్చిపోయే ఘటన వెలుగుచూసింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విక్రమ్ కదమ్ తరగతి గదిలోనే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం, విద్యార్థులే ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. ఆ వీడియోలో ఉపాధ్యాయుడు, ఒక మహిళతో తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటన బయటకు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు, ఇప్పటికే రెండు రోజుల క్రితం పంచాయతీ సమక్షంలో ఉపాధ్యాయుడికి కఠిన హెచ్చరికలు జారీ చేసినా, అతను తన ప్రవర్తనలో మార్పు చూపలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే తప్పును మళ్లీ పునరావృతం చేయడంతో, గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వీడియో నిజానిజాలు, సంబంధిత మహిళ వివరాలను కూడా సేకరిస్తున్నారు. నిర్ధారణ అనంతరం ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.