అనంతపురం, అక్టోబర్ 26 :
వైఎస్‌ఆర్‌సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట, ఏ.నారాయణపురం, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయితీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో కొత్తగా కమిటీలను నవంబర్ 16వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పంచాయితీకు ఒక అధ్యక్షుడు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శులు, ఆరుగుగు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉంటారని చెప్పారు. అనుబంధ సంఘాలకు సంబంధించి యువజన, మహిళ, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను కూడా పూర్తి చేయాలన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి పంచాయితీకు ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేయాలని సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారిని కమిటీల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కమిటీలు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయితీ పరిధిలో ఉన్న వైసీపీ నాయకులను సమన్వయం చేసుకుని వెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిల్లో సైన్యంలా పని చేసే కమిటీలు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఉంటాయని, పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని, కానీ చేసింది చెప్పుకోలేక పోయామన్నారు. ఏడాదిన్నరగా చంద్రబాబు, అధికార పార్టీ నేతలు ప్రచారానికే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
*పంచాయితీ స్థాయిలో ‘కోటి సంతకాల సేకరణ’*
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పంచాయతీ స్థాయిలో ‘కోటి సంతకాల సేకరణ’ చేపట్టాలని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో పేదలకు మెరుగైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందుబాటులోకి తేవడం కోసం రూ.8 వేల కోట్లతో ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో 2023–2024 నాటికే ఐదు మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని చెప్పారు. పంచాయతీల్లో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. సంతకాల సేకరణతో పాటు ‘ప్రజా వైద్యం.. ప్రజల హక్కు’ పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. సంతకాల సేకరణ ప్రారంభం మాత్రమేనని, దీన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈనెల 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో జరగాల్సిన ర్యాలీ తుఫాన్ దృష్ట్యా వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని, కావున 4వ తేదీ పెద్దఎత్తున ర్యాలీకు హాజరవ్వాలని తెలిపారు.


Comments
Post a Comment