పాత నాయకులపై 'మద్యం దుకాణాల నుంచి అక్రమ వసూళ్ల' ఆరోపణలు, నియంతృత్వ పోకడలపై అసంతృప్తి
ఉరవకొండ, అక్టోబర్ 12 (ఆదివారం):
ఉరవకొండలో జర్నలిస్టుల సంఘంలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు రెండుగా చీలిపోవడానికి దారితీశాయి. పాత యూనియన్ నాయకత్వంపై మద్యం దుకాణాల దారుల నుంచి స్వలాభం కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న తీవ్ర ఆరోపణలు, నియంతృత్వ పోకడలపై అసంతృప్తితో ఉన్న కొందరు పాత్రికేయులు ఆదివారం ఏకమై ప్రత్యేక యూనియన్‌ను ప్రకటించారు.
అసంతృప్తికి ప్రధాన కారణాలు:
ఉరవకొండలో ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ యూనియన్ నేతలు విలేకరుల సమస్యలు, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. యూనియన్ ముసుగులో మద్యం దుకాణాల దారులతో అక్రమ వసూళ్లకు పాల్పడి, ఆ మొత్తాన్ని తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, రెండు, మూడు అక్షరాల దినపత్రికలకు చెందిన కొందరు నాయకులు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరి, నియంతృత్వ ధోరణులతో విసిగిపోయిన పాత్రికేయులు ఈ కొత్త యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
పాత నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు:
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు పాత్రికేయుల హవా కొనసాగిందని, వీరు అందరినీ కలుపుకుపోతామని చెప్పి, కేవలం స్వప్రయోజనాల కోసం యూనియన్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అసంతృప్తి పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన యూనియన్ జవాబుదారీతనంతో, అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని అసమ్మతి వర్గం ప్రకటించింది.
సమాచారం అందకుండా యూనియన్ ఏర్పాటుపై విమర్శలు:
కొందరు పాత్రికేయులు సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవం రోజున కొత్త యూనియన్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయమే అయినప్పటికీ, ఈ విషయాన్ని మొత్తం పాత్రికేయులందరికీ సమాచారం అందించకుండా మొక్కుబడిగా ఏర్పాటు చేశారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉరవకొండలో నేటితో రెండు జర్నలిస్ట్ యూనియన్లు అధికారికంగా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. కొందరికి సమాచారం ఇవ్వకుండా రెండో యూనియన్ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరికొందరు పాత్రికేయులు మూడో యూనియన్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
మద్యం దుకాణ దారులతో అక్రమ వసూళ్లపై విచారణకు డిమాండ్:
కొంతమంది విలేకరులు పాత యూనియన్ నాయకులు పాల్పడిన మద్యం దుకాణ దారులతో అక్రమ వసూళ్లపై తక్షణమే విచారణ జరిపి, నిజమని తేలితే ఆ యూనియన్‌ను రద్దు చేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వృత్తి విలువలే ముఖ్యం:
ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత విలేకర్లదేనని, ఆ వృత్తి విలువలను కాపాడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. యూనియన్ ముసుగులో స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడటం వృత్తికి తీరని నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. పాత్రికేయ సంఘాలు విలేకరుల సంక్షేమం కోసం, వృత్తి విలువలను పెంపొందించే విధంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు.

Comments
Post a Comment