గుంటూరు జిల్లా రాళ్లపాడు ఘటనపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతోనే ఈ దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. అధికారపార్టీ నేత వాహనంతో దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు.
శనివారం గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన రామచంద్రయాదవ్, మృతుని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాళ్లపాడు లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ప్రభుత్వం చట్టవ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు.
చంద్రబాబు జీవితం అంతా రెండు నాల్కల ధోరణితోనే సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో బిసిలపై అనేక దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ దాడులను చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. బిసి బిడ్డ అమరనాథ్ గౌడ్ హత్య, దళిత డాక్టర్ సుధాకర్ మరణాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.
చంద్రబాబు పాలనలో బిసిలు, దళితులతో పాటు అధికారంలోకి రావడానికి సహకరించిన వర్గాలపై కూడా దాడులు జరిగాయి. ఆయన నేరాలను అరికట్టకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు,” అని రామచంద్రయాదవ్ వ్యాఖ్యానించారు.
అలాగే, మార్పు కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ సొంత సామాజికవర్గంపై దాడులు జరిగినా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. “సామాజిక న్యాయం గురించి చెప్పేవారు ఇలాంటి దాడులపై మౌనం ఎందుకు?” అని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment