“ మునుపెన్నడూ లేనివిధంగా గత మూడేళ్ల కాలం నుంచి, చిత్రాల్లో వినోదం పేరిట 'అశ్లీలం' చోటు చేసుకుంది. ఇది ఆరోగ్యదాయకం కాదు. కావ్యాలలో ప్రాచీన గ్రంథాలలో బూతు లేదా?- అని కొందరి ప్రశ్న. ఆ కావ్యాలు, గ్రంథాలూ విద్య నేర్చిన చదువరుకు మాత్రమే పరిమితం. పైగా ఆ చదివేవారు సంస్కారవంతులూ. వారి అవగాహన వేరుగా ఉంటుంది. కాని అదే బూతుని చిత్రాల్లో వినిపిస్తే, అక్షర జ్ఞానం లేని పిల్లలకు కూడా సులభంగా అర్థమవుతుంది.
"నువ్వొక వాక్యం రాస్తే - దాన్ని ముందుగా నీ తల్లికీ నీ భార్యకీ కూతురికీ వినిపించి వాళ్లు దాన్ని ఒప్పుకుంటేనే ప్రచురించు" అన్న కీ.శే.
భమిడిపాటి కామేశ్వర రావు గారి వ్యాఖ్యని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
ఇంట్లో మన పిల్లలు బూతు మాట్లాడితే, దండించే మనం ఇతరుల పిల్లలకి చిత్రాల ద్వారా బూతులు నేర్పడం సమంజసమా?
"సెక్స్ చెయ్యడం తప్పు కాదు. తెరమీద చూపించడం తప్పు. వయలెన్స్ తెరమీద చూపించడం తప్పు కాదు - చెయ్యడం తప్పు!" అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత నిర్దేశకుడు డేవిడ్ లీన్.
చక్కని హాస్యానికి బదులు ఇవాళ అశ్లీలం చోటు చేసుకోడం చాలా విచారకమైన విషయం. పైగా ప్రేక్షకుల మెచ్చుకుంటున్నారనుకోడం కూడా - న్యాయం కాదు. మంచి హాస్యం, చక్కని వినోదం ఇస్తే ప్రేక్షకులు హర్షించడం లేదా? ఆనందించడం లేదా? సినిమాకి వెళ్లి కూచున్నా ఇంట్లో కొత్త సినిమా కాసెట్టు చూసినా ఎక్కడ అశ్లీలం వినిపిస్తుందో, ఎక్కడ బూతు వచ్చేస్తుందోనన్న భయంతో చూడవలసి వస్తోందని - చాలామంది చెబుతూ, అంచేత చూడ్డమే మానేస్తున్నాం అని అంటున్నారు.
ఏమైనా - ప్రస్తుత 'బూతు దశ' నుంచి చిత్ర రంగం బయట పడుతుందని, "నబూతో నభవిష్యతి” అనే స్థితి నుంచి, చిత్ర రచయితలు, దర్శకులు నిర్మాతలు తప్పుకుని, 'నభూతో నభవిష్యతి' అనిపించేంతటి చక్కని చిత్రాలను అందిస్తారని - ఆశిస్తున్నారు.

Comments
Post a Comment