ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:
వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమేనని..
ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో శ్రీరామ్ పాల్గొన్నారు.
ముందుగా ఎర్రగుంట సర్కిల్ వద్ద నూతనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు వాల్మీకి సంఘం నాయకులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంఘం నాయకులను అభినందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో శ్రీరామ్ పాల్గొని మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకునే విధంగా విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించే విధంగా ఉంటుందన్నారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉందన్నారు. ఇందు కోసం వారు చేస్తున్న పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమేనన్నారు. వాల్మీకి రిజర్వేషన్ అంశంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కృషి చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో కూడా ఇటీవల దీని గురించి ప్రస్తావించారన్నారు. పార్లమెంటులో కూడా దీనిపై పోరాటం చేస్తున్నారన్నారు. త్వరలోనే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న కల నెరవేరుతుందన్నారు.....


Comments
Post a Comment