అమరావతి: ఉద్యోగి మరణించిన తరువాత వారసులకు ఇచ్చే కారుణ్య నియామకం హక్కు కాదని, అర్హత ఉన్నప్పుడే ఇవ్వవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం ఆకస్మికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటమే ఈ పథక ఉద్దేశమని గుర్తుచేసింది.
చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామ పరిపాలన అధికారి (వీఏఓ) రాజేంద్ర పిళ్లై 1999లో కన్నుమూశారు. ఆయన కుమారుడు ఉదయ్ కిరణ్ 2009లో కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోగా, అధికారులు తిరస్కరించారు. అనంతరం 2017లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి 2021లో ఉదయ్ కిరణ్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్ అప్పీల్ వేశారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది జి.రాజు వాదిస్తూ, “ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు దరఖాస్తు చేయాలి. కానీ పిటిషనర్ 2009లో దరఖాస్తు చేశారు. కాబట్టి సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలి” అని విన్నవించారు.
జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ఎనిమిదేళ్ల జాప్యం తర్వాత హైకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం, జాప్యానికి కారణాలను కూడా పిటిషనర్ వివరించలేదని పేర్కొంది.
దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేస్తూ, “ఉద్యోగి మరణించి సంవత్సరాల తరువాత వచ్చిన దరఖాస్తును అంగీకరించడం సాధ్యం కాదు. నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించలేం” అని తేల్చిచెప్పింది.

Comments
Post a Comment