అధికారమనేది నీటి మీద బుగ్గ.
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, న్యాయవాద వృత్తి విస్తరణకు అత్యంత కీలకమైన ఆంధ్ర హైకోర్టు ప్రధాన బెంచ్ (లేదా హైకోర్టు)ను కర్నూలులో సాధించేందుకు స్థానిక న్యాయవాదుల మధ్య ఐక్యత అవసరమని ప్రముఖ న్యాయవాద వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రాపకంలో వ్యక్తిగత లబ్ధి కంటే, ప్రాంతీయ ప్రయోజనాలే ముఖ్యమని, హైకోర్టు స్థాపనతో వేలాది మంది న్యాయవాదులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి.
రాజకీయ నియామకాలపై ఆగ్రహం:
రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొద్దిమంది లాయర్లకు (సుమారు 10 మందికి) తాత్కాలిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోస్టులు ఇవ్వడం మినహా, రాయలసీమకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే హైకోర్టు ఏర్పాటుకు చిత్తశుద్ధి చూపడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం అనేది నీటి మీద బుగ్గ లాంటిది" అని పేర్కొంటూ, రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కర్నూలు అభివృద్ధికి హైకోర్టు కీలకం:
రాయలసీమ ప్రాంత కేంద్రమైన కర్నూలులో ఆంధ్ర హైకోర్టు లేదా శాశ్వత బెంచ్ ఏర్పాటైతే ప్రాంతం కొంతైనా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా న్యాయ ప్రాక్టీస్ చేసే వారికి భారీ స్థాయిలో పని దొరుకుతుందని వారు అభిప్రాయపడ్డారు. కేవలం పది మంది లాయర్ల ప్రయోజనం కంటే, యావత్ ప్రాంత న్యాయవాదులకు, ప్రజలకు న్యాయ సదుపాయాలు దగ్గరై, అభివృద్ధికి అవకాశం దొరికే హైకోర్టు ఏర్పాటుకు కృషి చేయడమే మంచిదని నొక్కి చెప్పారు.
హామీలు.. ఆచరణ శూన్యం:
గత ప్రభుత్వాల హామీలు, తీర్మానాలు ఆచరణకు నోచుకోలేదని లాయర్లు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం న్యాయ రాజధానిని ఏర్పాటు చేయలేదన్న విమర్శలు ఉండగా, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా, కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీ ఇచ్చి, 2025 డిసెంబరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆచరణలో పెట్టలేదని మండిపడుతున్నారు.
అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదు:
దాదాపు రెండేళ్ల పాలనా కాలం సమీపిస్తున్నా, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఎలాంటి గట్టి చర్యలు తీసుకోకపోవడం పాలకవర్గాల చిత్తశుద్ధికి నిదర్శనమని లాయర్లు విమర్శించారు. అడగనిదే, పోరాటం చేయనిదే, ఒత్తిడి తీసుకురానంత వరకు ఏ పాలకవర్గ పార్టీ కూడా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదనేది 'నగ్న సత్యం' అని వారు పేర్కొన్నారు.
ఐక్యతతో పోరాడాలని పిలుపు:
ఈ నేపథ్యంలో, కర్నూలు బార్ లాయర్లు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, 16-11-1937 శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితో కర్నూలులో ప్రధాన హైకోర్టు లేదా కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు.
కర్నూలు బార్ అసోసియేషన్ పిలుపు:
కర్నూలు బార్ అసోసియేషన్ ఇచ్చిన తీర్మానం మేరకు మూడు రోజుల పాటు కోర్టు విధులను పూర్తిగా బహిష్కరించడానికి మద్దతు తెలపాలి.
భారత ప్రధాని కర్నూలు పర్యటన సందర్భంగా, నేడు రేపు కర్నూలు బార్ అసోసియేషన్ చేపట్టబోయే ఆందోళనకు ప్రతి ఒక్క కర్నూలు న్యాయవాది మద్దతు తెలిపి, తమ వంతు కనీస బాధ్యతగా సంపూర్ణ సంఘీభావం తెలపాలని కోరారు.
న్యాయవాదులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమై, రాయలసీమ ప్రజల ప్రయోజనం కోసం ఈ చారిత్రక పోరాటంలో భాగస్వాములు కావాలి.

Comments
Post a Comment