!
పని హక్కు అనేది మనిషి గౌరవానికి, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక హక్కు.న్యాయమైన,సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి మనిషికీ వుంది.గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని పని కోసం ఉపాధి హామీ పథకాల ద్వారా చట్టపరమైన పని హక్కు కల్పించబడుతోంది.
అంతేకాదు,నిర్దిష్ట పనిగంటలు అమలు జరుగుతున్నాయి.దేశంలోని ప్రతి వ్యక్తీ సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలే ప్రాథమిక హక్కులు.‘భారత ప్రజాస్వామ్యా నికి పునాదిరాళ్లు ప్రాథమిక హక్కులు’అంటారు నానీ ఫాల్కీవాలా.
పనిహక్కు అనేది ప్రజలకు ఉత్పాదక పనిలో పాల్గొనే ప్రాథమిక హక్కును సూచిస్తుంది.దీనిని 1948 ఐరాస మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో పొందుపరిచారు.భారత రాజ్యాంగం, ముఖ్యంగా ఆర్టికల్ 21, 41 ప్రకారం…జీవించే హక్కులో భాగంగా పనిచేసే హక్కుకు హామీ ఇస్తుంది.ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ అసంభవం’ అంటారు గాంధీజీ.
కానీ,ఆర్థిక స్వాతంత్య్రం…పని లేకుండా సాధ్యం కాదు.పని-కేవలం ఆదాయం సంపాదించే మార్గం మాత్రమే కాదు,అది ఒక వ్యక్తికి గౌరవం,సామాజిక భాగస్వామ్యం,ఆత్మగౌరవాన్ని కల్పించడం.
‘జాతీయ కార్మిక విధానం 2025-2047 ముసాయిదా’ కొద్ది రోజుల్లో అమలులోకి రానుంది.మూడు దశల్లో అంటే…
2025-27,2027-37,2037-47 లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.తద్వారా దాదాపు 50 కోట్ల మంది శ్రామికులను ప్రభావితం చేస్తుందని అంచనా.జస్టిస్ గజేంద్ర గడ్కర్ నేతృత్వంలోని మొదటి కార్మిక సంఘం సిఫార్సుల మేరకు అనుస రిస్తున్న సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత,వేతనాల స్థిరీకరణ వంటి కార్మిక చట్టాలను ఈ విధానం అణచివేస్తుంది.‘ ప్రభుత్వం గొప్పతనం,అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి వుంటుంది’ అంటారు హెచ్.జె.లాస్కి.
మోడీ ప్రభుత్వంలో అమలు చేయనున్న జాతీయ కార్మిక విధానం…కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా మార్చివే సింది. కొత్త ప్రతిపాదన ప్రకారం,ఉపాధి ఇకపై ఒక కర్తవ్యం మాత్రమే,హక్కు కాదు.కొత్త విధానం పనిని ఒక హక్కుగా తొలగించి,దానిని ధర్మంగా,ఒక కర్తవ్యంగా,సేవగా మారుస్తున్నది.ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతాలను అణచివేయడమే. అంతేకాదు..కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు రక్షణగా కొత్త జాతీయ విధానం వుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
శతాబ్దాల పోరాటం ద్వారా సంక్రమించిన హక్కులు కోల్పోవడమే కాకుండా,బలహీనమైన కార్మికులను పూర్తిగా వీధిలోకి విసిరేస్తారు.రాజధర్మం పేరుతో కార్మిక హక్కులు త్యాగం చేయబడితే,ఆర్థికాభివృద్ధి ఒక వర్గానికే లాభిస్తుంది.దాతృత్వం,ఔదార్యం ముసుగులో హక్కులులేని బానిసలుగా శ్రామికులు మారతారు.2024 లెక్కల ప్రకారం…భారతీయ శ్రామిక శక్తి దాదాపు 61 కోట్లు.
ఈ విధానంతో దేశంలోని 50 కోట్లకు పైగా వున్న శ్రామికుల భవిష్యత్ ప్రమాదంలో పడింది.శ్రమను హక్కుగా కాక ధర్మంగా బోధించడం అంటే, అంబేద్కర్ స్వప్నించిన సమానత్వ రాజ్యాన్ని రద్దు చేయడమే.మనుస్మృతి ఆధారిత ఆలోచనలను శ్రమ న్యాయాలుగా మలచడం అంటే రాజ్యాంగాన్ని సవాలు చేయడమే.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం…హక్కుల పునాది పైనే ఆధారపడి వుంది.పని హక్కుగా వుండాలి…దాతృత్వంగా కాదు.యువత భారతదేశం యొక్క గొప్ప సంపద.ప్రతి ఏడాదీ లక్షలాది యువతీ యువకులు ఉపాధి ఆశతో మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగం,ఉపాధిలేమి వారిని నిరాశ,నిస్పృహలలోకి నెట్టేస్తున్నది. శ్రమించేవారికి భద్రత ఇవ్వకుండా, దేశాభివృద్ధిని ఆశించడం స్వప్నమే తప్ప,వాస్తవం కాదు’అంటారు అమెరికన్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కెయిన్స్.దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే…
ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యం కావాలి.కార్మికుల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం,సామాజిక భద్రత కల్పించడం ద్వారా ఆర్థిక పురోగతికి దోహదపడాలి.అంతేతప్ప…ప్రజావ్యతి రేక విధానాలను తెచ్చి, కార్మికవర్గాన్ని, సామాజిక న్యాయాన్ని బలి చేయకూడదు.

Comments
Post a Comment