![]() |
| టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ |
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
అక్రమ కేసులతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వేధించారు
- టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనపై అక్రమంగా హత్య కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశాడని, దీంతో తీవ్రంగా నష్టపోయానని సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం శిరిగారిపల్లికి చెందిన కే.రవీంద్ర మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- మాజీ సైనికుల సేవలను గుర్తించి కడప నగరం లేదా చింతకొమ్మదిన్నె మండలంలో 250 మంది మాజీ సైనికుల కుటుంబాలకు ఉచితంగా లేదా, ప్రభుత్వ నామమాత్రపు ధరతో పదెకరాల స్థలాన్ని కేటాయించి అండగా నిలవాలని కడపకు చెందిన జై జవాన్ మూచ్యువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- అనంతపురం జిల్లా గుంతకల్లు 7వ వార్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన సురేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. రోడ్లు, డ్రైనేజీ సదుపాయం కల్పించడంతో పాటు విద్యా సదుపాయాలు మెరుగుపర్చాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- వంశపారంపర్యంగా తమకు సంక్రమించిన 4.86 ఎకరాల వ్యవసాయ భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన కస్తూరి రామన్న మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ భూమిని సాగుచేయకుండా అడ్డుకుంటున్నారని, సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తమ భూమిని తిరిగి అప్పగించాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఆర్ జిల్లా దేవీపట్నం, పూడిపల్లికి చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దేవీపట్నంలో పునరావాస కాలనీ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న తన తల్లి గారు 9 నెలల క్రితం మరణించారని, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కింద తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కోడూరు అశోక్ విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- పలు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఒంగోలుకు చెందిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ రియల్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా, మద్దికెర మండలం, పెరవలికి చెందిన ఎమ్.రంగస్వామి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- వైసీపీ హయాంలో తొలగించిన దివ్యాంగ పెన్షన్ ను పునరుద్ధరించడంతో పాటు కష్టాల్లో ఉన్న తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజయవాడ రాణిగారితోటకు చెందిన షేక్ గుల్జార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- ఆప్కాస్ కింద ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం చేస్తున్న తాను రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయానని, అయితే పొరుగు సేవల ఉద్యోగి కావడంతో తనకు దివ్యాంగ పెన్షన్ అందడం లేదని గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన యు.భాస్కర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రేషన్ కార్డు పరిధిలో ఉండటంతో దివ్యాంగుడైన తన తండ్రికి కూడా వైసీపీ హయాంలో పెన్షన్ తొలగించారని వాపోయారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందానని, ఎలాంటి ఆధారం లేని తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజయవాడ జక్కంపూడికి చెందిన అన్నె వసుంధర మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments
Post a Comment