-మహిళలపై జరుగుతున్న హింస ను నియంత్రించాలి
ఉరవకొండ మండలం లో
గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్ట్ షాపులను ప్రభుత్వం అరికట్టాలని, మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసను నియంత్రించాలని సిపిఐ పార్టీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య (ఎన్ఎఫ్ ఐడబ్ల్యూ) అనంతపురం జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు.
మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మద్యం బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అంతేకాకుండా మద్యం కారణంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని రోడ్డు ప్రమాదాలు కుటుంబ కలహాలు మద్యం వల్ల జరుగుతున్నాయని ప్రభుత్వం తక్షణమే వీటిని నియంత్రించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం వెంటనే అమలు చేయాలన్నారు. ఉచిత గ్యాస్ పథకం కూడా అనేకమంది మహిళలకు అందడం లేదని అర్హులైన వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలన్నారు. తల్లికి వందనం, అన్నదాత పథకాల్లో కూడా అనేకమంది అర్హులైన వారికి అన్యాయం జరిగిందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం సామాన్య మహిళల కన్నా ఉద్యోగులకు, సంపన్న వర్గాలకి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రభుత్వం అరికట్టాలని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. మహిళలుకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన చట్టాలను బలోపేతం చేయాలని మహిళలు, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం అరికట్టాలన్నారు.
మహిళల హక్కులు మరియు సమానత్వం గురించి సమాజంలో ప్రభుత్వాలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన మహిళలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఆహారం, ఆరోగ్యం, జీవిత భద్రతను ప్రభుత్వాలు కల్పించాలన్నారు. ఉరవకొండ పట్టణంలో స్థానిక శివరామిరెడ్డి కాలనీలో తాగునీటి సరఫరా కాకపోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కాలనీలో మంచినీళ్లు సదుపాయం కల్పించాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ( ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ) ఉరవకొండ నియోజకవర్గం నూతన శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా సమైక్య సమావేశాన్ని నిర్వహించి ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్ గా నూర్జహాన్, కో కన్వీనర్ గా అశ్వర్తమ్మ, నాగలక్ష్మి కార్యవర్గ సభ్యులుగా సంజమ్మ, రజియా తదితరులను ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఉరవకొండ నియోజకవర్గ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గన్నె మల్లేష్, పురిడి తిప్పయ్య, రైతు సంఘం నాయకులు వరప్రసాద్ మహిళా సమైక్య నాయకురాలు యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment