జనవరి 17:
ప్రవేశ పరీక్ష అయినా, పోటీ పరీక్షలైనా.. కటాఫ్ మార్కులు అంటే అర్హుల్ని నిర్ణయించే ఓ ప్రామాణికం. కానీ మైనస్ 40 మార్కులైనా సీటు దక్కుతుందంటే అంతకంటే విడ్డూరం ఏముంటుంది అంటున్నారు వైద్యనిపుణులు. నీట్ పీజీ-2025 మూడో రౌండు ప్రవేశాల కోసం ఎన్‌బీఈ కటాఫ్ మార్కులు తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంతో మైనస్ మార్కులు వచ్చిన విద్యార్థులూ పీజీలో ప్రవేశం పొందుతారు. ఈ అసంబద్ధ నిర్ణయంపై వైద్యవర్గాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇది వైద్య ప్రమాణాలకు పాతర వేయడమేనంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి గతంలో 50 పర్సంటైల్‌తో 276 మార్కులు రావాల్సి ఉండగా కటాఫ్ తగ్గింపుతో.. 7 పర్సంటైల్‌తో 103 మార్కులు వచ్చిన వారు కూడా అర్హులే అవుతారు. దివ్యాంగుల కోటాలో 45 పర్సంటైల్‌ను కేవలం 5 పర్సంటైల్‌కు ఎన్‌బీఈ తగ్గించింది. అంటే వీరికి 90 మార్కులు వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు గతంలో 40 పర్సంటైల్‌తో 235 మార్కులు సాధిస్తే సీటు దక్కేది. ఇప్పుడు వీరు సున్నా పర్సంటైల్‌తో మైనస్ 40 మార్కులు వచ్చినా పీజీ ప్రవేశానికి అర్హులవుతారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సీనియర్ రెసిడెంట్ల వైద్యుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
