బూదగవి సూర్య నారాయణ దేవస్థాన విశిష్టత:ఉరవకొండ మండలం బూదగవి లో
అతి ప్రాచీన సూర్యదేవాలయంఉంది.. ఇది చోళరాజులకాలం 13వ శతాబ్దం నాటి దేవాలయం. ఈ దేవాలయం మనరాష్ట్రంలో 2వదిగా, దక్షిణ భారతదేశంలో 3వదిగా, యావత్భారతదేశంలో 8వ దేవాలయముగా, ప్రపంచంలో దక్షిణ అభిముఖముగా ఉన్న ఏకైక సూర్యదేవాలయముగా చరిత్రకారులు చెబుతున్నారు. మన శాస్త్ర ప్రమాణముగా దక్షిణ దిక్కు అధిపతి అయిన తన కుమారుడు యమదేవుడు కావున ఈ దేవాలయములో పూజ, యజ్ఞ సూర్యనమస్కారములు చేసిన లేదా చేయించిన అపమృత్యుభయము పోయి సర్వరోగములు నయమవడం తథ్యం. ఇక ఇక్కడి దేవస్థానములో విశేషం సూర్యనారాయణస్వామికి తన ముఖ్యశిష్యుడు రామావధూత హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం.
మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉంటూ 182 దేశాలలో ఆరాధ్య దైవంగా భావించే కలియుగ దైవం భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు ఉరవకొండలో ఉంటున్న సమయంలో ఈ దేవాలయంకు ప్రతి నిత్యం వచ్చి అభిషేకము, అర్చన, తన స్వహస్తాలతో చేసేవారని తన జీవిత చరిత్రలో పేర్కొనడం విశేషం.
శ్రీ సూర్య భగవానుడు దక్షిణ దిక్పాలకుడైన తన కుమారుడు యమధర్మరాజును చూచుచున్నందున శ్రీ సూర్యనారాయణుని ఆరాధన చేసినట్లయితే స్వామి కృపవలన ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము లభిస్తాయి.
స్వామి నమస్కార ప్రియుడు కావున భక్తులు ఆలయంలో ప్రవేశించుటకు ముందు “ఓం నమో భగవతే సూర్యాయ” అనే మహా మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఆలయ ప్రదక్షిణలు (3, 7, 21, 54, 108....) ఈ విధంగా గావించినచో వారి మనోభీష్టములు తప్పక నెరవేరును.
ప్రపంచంలో ఉండే ముక్కోటి దేవతామూర్తులలో ఏ దేవున్ని అయినా మనం వివిధ రకాలుగా (శిలా రూపంలో లేదా విగ్రహరూపంలో) పూజిస్తాము. కానీ మనకు ప్రత్యక్షముగా కనిపించే ఏకైక దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తియే.
రథసప్తమి విశిష్టత
ఈ దినం ముఖ్యముగా సూర్యున్ని ఆరాధించే పండుగ. ఈ దినమున సూర్యనారాయణుడు తన రథమును ఉత్తర దిక్కుగా పయనించే రోజుకు గుర్తుగా మహాభారత కాలము నుండి ఈ రథసప్తమి పండుగను జరుపుకుంటున్నట్లు చారిత్రక ఆధారములు లభిస్తున్నాయి. ఈ దినమున ముఖ్యముగా చేసే శాస్త్ర విధులలో మాఘ స్నానం, సూర్యనమస్కారములు, అరుణ పారాయణం, హోమము, ధానము, ధర్మము చేయుట వలన 7 జన్మములలో చేసిన పాపము తొలుగును అని మన శాస్త్ర గ్రంధములైన మదనరత్నము, ధర్మసింధు, నిర్ణయామృతము వంటి మహాగ్రంధములలో తెలుపబడినది. ఈ సప్తమి తిథి రోజున, అరుణ మహాసౌర హోమము, సూర్యనమస్కారములు చేయించిన, మరియు ఎర్రని వస్త్రములు, గోధుమలు గురువుకు గాని, బ్రాహ్మణునికి గాని దానమిచ్చిన సూర్యుని పరిపూర్ణ అనుగ్రహము పొంది, ఆయురారోగ్యములు పొంది సంతానాభివృద్ధి మరియు రాజయోగము కలిగి సర్వత్ర విజయము పొందుదురని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించినట్లుగా భవిష్యోత్తర పురాణము నందు కలదు.

