మూసీ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
September 27, 2025
0
హైదరాబాద్: నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మూసీ వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
కమిషనర్ చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా చాదర్‌ఘాట్ పరిసరాల్లో నది నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరదలో ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించే చర్యలను కమిషనర్ ప్రత్యక్షంగా గమనించారు. ఎంజీబీఎస్ సమీపంలో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నీరు లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను కూడా పరిశీలించారు.
దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా DRF బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చొరబడినప్పుడు DRF, పోలీసులు, RTC, GHMC సిబ్బంది కలసి వందలాది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆయన అభినందించారు.
మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, NDRF, SDRF, GHMC, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని శ్రీ ఏవీ రంగనాథ్ తెలిపారు.
