కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ ఘోర విషాదానికి కారణమైంది. కరూరులో శనివారం రాత్రి జరిగిన ఆయన సభలో తొక్కిసలాట చోటుచేసుకోగా, 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్, ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. ప్రతి శనివారం రెండు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, నామక్కల్‌లో ఉదయం ప్రచారం ముగించుకుని సాయంత్రం కరూరుకు చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో వేలుసామిపురంలో సభ జరుగుతుండగా, విజయ్‌ను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంలో అనేక మంది ముందుకు దూసుకెళ్లారు.
ఆహుతులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు గుంపులో ఇరుక్కుపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో గందరగోళం తలెత్తింది. వెంటనే పోలీసు సిబ్బంది, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను ఆసుపత్రులకు తరలించారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 38 మంది మృతి చెందారని ధృవీకరించింది. క్షతగాత్రులు పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Comments
Post a Comment