ఉరవకొండ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధికారి, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలను రాయంపల్లికి చెందిన రేగటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పటికీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవకుడిని మాత్రమేనని, పాలకుడిని కానని ఆయన స్పష్టం చేశారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవకు భగవంతుడు తనకు అవకాశం ప్రసాదిస్తే, భక్తులు, అధికారులు, సిబ్బంది మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానని నాగరాజు చెప్పారు. తమ కుటుంబం పయ్యావుల సోదరులకు అండగా ఉంటుందని, అవసరమైతే వారి కోసం ప్రాణాలైనా ఇస్తామని తెలిపారు. తన సోదరులు లక్ష్మన్న, భీమన్నలతో కలిసి తాను ఎల్లప్పుడూ వారి పక్షానే ఉంటామని పేర్కొన్నారు.
పాలకమండలి చైర్మన్‌గా అవకాశం లభిస్తే, దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని నాగరాజు తెలిపారు. తాము ఎప్పటికీ స్వామివారికి, భక్తులకు, ప్రజలకు సేవకుడిగానే ఉంటామని పునరుద్ఘాటించారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామని, తమ చివరి రక్తపు బొట్టు వరకు సీఎం చంద్రబాబు నాయుడు, పయ్యావుల సోదరుల నాయకత్వాన్ని సమర్థిస్తామని రేగటి నాగరాజు వివరించారు.

Comments
Post a Comment