మంత్రి తీరుపై సాలూరు గిరిజన నాయకులు మండిపాటు బాధలు చెప్పేందుకు వస్తే అరెస్టులు చేయిస్తారా అంటూ ప్రశ్న
సాలూరు :-రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీరు అన్యాయంగా ఉందని, తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన నిరుద్యోగులను అరెస్టులు చేయించటం దారుణమని ఆదివాసీ గిరిజన నాయకులన్నారు. జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొండగొర్రె ఉదయ్ తో పాటు సాలూరు మండల ఏజేఏసీ ప్రెసిడెంట్ నిమ్మక అన్నారావు, మండల జనరల్ సెక్రటరీ సుర్ల ప్రవీణ్, ఆదివాసీ వికాస పరిషత్ ట్రెజరర్ మచ్చ భీమారావు తదితరులు ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. శనివారం సాలూరు జరిగిన గిరిజన నిరుద్యోగుల అరెస్టులు అన్యాయమన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
శనివారం ఉదయం పాడేరు, అరకు ప్రాంతాల నుండి కొంతమంది గిరిజన నిరుద్యోగులు మంత్రి సంధ్యారాణిని కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు రాగా వారిని తన ఇంటికి రానివ్వ కుండా చుట్టూ పోలీసులను కాపలా పెట్టారని, అంతేకాకుండా అరెస్టులు చేయించారన్నారు. సంధ్యారాణి గారు ఎన్నికల ముందు నేను మీ గిరిజన ఆడపడుచుని నాకు ఓటు వేసి గెలిపించండి అని కోరారని, అధికారంలోకి వచ్చాక పట్టించు కోవడం లేదన్నారు. తమ బాధలు, అన్యాయాన్ని వివరించే వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వస్తే అరెస్టులు చేయించటం అన్యాయమన్నారు. ఈ సందర్భంగా జగ్గుదొర వలస గిరిజనులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసారు. ఏజన్సీ ధ్రువ పత్రాల ఇప్పిస్తానని, ఏజన్సీ గిరిజన గ్రామాలను షెడ్యూల్డు గ్రామాలుగా ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చి మార్చిపోయారన్నారు. గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డిఎస్సీని నిర్వహించేలా చేస్తానని మాట ఇచ్చారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ గిరిజన నిరుద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో మాజీ డిప్యూటీ సిఎం ఉప రాజన్న దొర ఇంటికి ఇదే విధంగా సమస్యలను చెప్పుకునేందుకు పలు మార్లు వెళ్ళటం జరిగిందన్నారు. ఆయన ఎపుడూ అరెస్టులు చేయించలేదని, పోలీసులను ఉసి గొలప లేదన్నారు. రైతు కూలీ సంఘం నాయకుడు ఊయక ముత్యాలు ఐదు వందల మందితో దొర గారు లేనప్పుడు అతని ఇంటికి వచ్చి నిరసన తెలిపారని, అయినప్పటికీ వారి పట్ల దురుసుగా వ్యవహరించవద్దని పోలీసులకు చెప్పటంతో పాటు ఇంటి వద్ద ఉన్న తమ మనుష్యులకు చెప్పి ఆందోళన కారులకు మంచి నీరు, మజ్జిగ ఇప్పించారని గుర్తుచేసారు. అంతేకాకుండా 2020డిసెంబర్ 21న సిపిఎం నాయకులు పి. అప్పల నరసయ్య, సీదరపు అప్పారావుల ఆధ్వర్యంలో మూడు వేలకు పైగా గిరిజనులు రాజన్న దొర ఇంటికి విచ్చేయగ, ఆ సమయంలో ఆయన బయటకు వెళ్లారని, అప్పుడు కూడా ఇదే విధంగా పోలీసులకు చెప్పారన్నారు. తదుపరి వారంతా రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేస్తుండగా, క్యాంప్ నుండి వస్తున్న రాజన్న దొర నేరుగా వారి వద్దకు వెళ్లి, వారు చెప్పినవి విని, తన అభిప్రాయాన్ని, తమ ప్రభుత్వం అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారన్నారు. అంతే తప్ప పోలీసులను ఉపయోగించి నిర్భందించటం, అరెస్టులు చేయించటం చెయ్యలేదన్నారు. గిరిజనులు శాంతియుతంగా తమ బాధలు చెప్పుకునేందుకు విచ్చేస్తే అరెస్టులు చేయించటం మంత్రి సంధ్యారాణికి తగదన్నారు.

Comments
Post a Comment