మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి ఠాణా పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సీనియర్ల ఒత్తిడి, అవమానకర ప్రవర్తన భరించలేక జూనియర్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.
📌 ఘటన వివరాలు
- మృతుడు: జాదవ్ సాయితేజ (19)
- స్వగ్రామం: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం గ్రామం
- చదువు: ఘట్‌కేసర్ మండలం కొర్రెములలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల (రెండో సంవత్సరం)
- నివాసం: నారపల్లి వసతిగృహం
మొదటి సంవత్సరం విద్యార్థి పుట్టినరోజు వేడుకలో గొడవ జరగడంతో సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబు మధ్యవర్తిత్వం చేసి రాజీ చేయించాడు. దానికి బదులుగా పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఆదివారం రాత్రి నారపల్లిలోని ఓ బార్‌లో చిన్నబాబు సహా ఎనిమిది మంది విద్యార్థులు మద్యం సేవించి ₹8 వేల బిల్లు చేశారు. సాయితేజ తన వద్ద ఉన్న ₹2,500 మాత్రమే చెల్లించగా, మిగతా డబ్బులు చెల్లించమని చిన్నబాబు ఒత్తిడి చేయడంతోపాటు అవమానకరంగా మాట్లాడినట్టు సమాచారం.
మనస్తాపానికి గురైన సాయితేజ వసతిగృహానికి వెళ్లి, తండ్రికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిర్వాహకులు గది చేరుకునేలోపు అతడు ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు.
విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది విద్యార్థులపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మేడిపల్లి సీఐ ఆర్.గోవిందారెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల వద్ద, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోచారం ఐటీ కారిడార్ ఠాణాకు తరలించారు.
కళాశాల నిర్వాహకులు స్పందిస్తూ, చిన్నబాబు సంవత్సరం నుంచి తరగతులకు హాజరుకావడంలేదని స్పష్టం చేశారు.

Comments
Post a Comment