ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఒక పచ్చ పత్రికలో ఆ టీడీపీ నేత తనకు తాను పెన్నహోబిలం పాలకమండలి, ట్రస్ట్ చైర్మన్ హోదా అంటూ ప్రకటన వేయించుకున్నారు. అధికారికంగా ఎలాంటి నియామకం జరగకపోయినా, ఈ పోస్ట్ తనకే దక్కుతుందన్న అతి విశ్వాసంతో ఆయన ఈ ప్రకటన గుప్పించారు. అప్పటి నుంచి ఆలయ సిబ్బందిపై, అధికారులపై పెత్తనం చెలాయించడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. "ఇల్లు కట్టకనే ఎలకల రావిడి" అన్న చందంగా ఆయన తీరు మారిందని సిబ్బంది విమర్శిస్తున్నారు.
కొందరు సిబ్బంది ఆయన చర్యలపై అసహనం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయాందోళనలు చెందుతున్నారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే ఆయన ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదని సిబ్బంది బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
పెన్నహోబిలం పాలకమండలి చైర్మన్ పదవి కోసం అధికార కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ నేతకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అండదండలు ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో, ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఒక బీజేపీ మహిళా నేత కూడా ఈ రేసులో ఉన్నారు. ఆమెకు బీజేపీ అగ్రనేత దగ్గుపాటి పురందేశ్వరి మద్దతు ఉందని సమాచారం.శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో, మహిళా కోటా కింద పదవి దక్కే అవకాశం ఆ బీజేపీ నేతకు ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. అలాగే, పదవుల పంపకంలో బీజేపీ కూటమి భాగస్వామిగా ఉన్నందున, ఆ కోటా కింద కూడా పదవి దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎవరికి వారే చైర్మన్ పదవి తమకే దక్కుతుందనే భావనలో ఉన్నారు.
అయితే, పయ్యావుల సోదరుల మాటే ఈ విషయంలో శాసనం అని, వారి నిర్ణయమే కీలకం కానుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, చైర్మన్ నియామకానికి ముందే ఈ పరిణామం ఆలయ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదాస్పద చర్యలకు ఎవరు ముగింపు పలుకుతారో అనేది ఆసక్తిగా మారింది.
Comments
Post a Comment