6
వేల ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడి
గత ఐదేళ్లలో ఒక్క రిక్రూట్‌మెంట్ కూడా జరగలేదని విమర్శ
రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్న మంత్రి
సమస్యలున్నా ఉద్యోగులందరికీ డీఏ ఇచ్చామని వ్యాఖ్య
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు నియామకాల ఆవశ్యకత ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.
గత ఐదేళ్ల పాలనలో పోలీసు శాఖలో నియామకాలు చేపట్టలేదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని, వీరికి త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
