అనంతపురం జిల్లా (బొమ్మనహాల్):
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగినప్పటికీ, సాంప్రదాయ పద్ధతుల్లోని కృషి, ముఖ్యంగా పశు సంపద అందించే సహకారం వెలకట్టలేనిది అని నిరూపించే అపూర్వ ఘట్టం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బొమ్మనహాల్ మండలం, గోవిందవాడ గ్రామానికి చెందిన అంపన్న గారి స్వామి పొలంలో అలసంద సాగు కోసం ఉపయోగించిన జోడెద్దులు (బసవన్నలు) కేవలం 9 గంటల్లో 20 ఎకరాల సాగును పూర్తి చేసి రైతుల మన్ననలు పొందాయి.
అలుపు సొలుపు లేకుండా...
సాగు పనులు గురువారం ఉదయం 5 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు పూర్తయ్యాయి. అంటే, కేవలం 9 గంటల వ్యవధిలో అలసంద పంట విత్తనాన్ని 20 ఎకరాల్లో విజయవంతంగా సాగు చేశాయి. ఈ ప్రక్రియలో రైతు స్వామి తరఫున రేవన్న, రాముడు, గుడ్రు వన్నప్ప అనే ముగ్గురు రైతులు వంతుల వారీగా పాల్గొన్నారు.
అయితే, మనుషులు మారినా, ఈ బసవన్నలు మాత్రం 'తగ్గేదే లేదంటూ' ఎలాంటి అలుపు సొలుపు లేకుండా, ఏకధాటిగా, అత్యంత ఉల్లాసంగా సాగును కొనసాగించడం అందరినీ అబ్బురపరిచింది. వాటి అద్భుతమైన కృషిని చూసి రైతులంతా ఉద్వేగానికి లోనై, "సహాబాష్ బసవన్నలు!" అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రైతులు కేరింతలు, ఈలలతో ఎద్దులను మరింత ఉత్సాహపరిచారు.
ఈ అపూర్వమైన కృషికి గుర్తుగా, సాగు పూర్తయిన వెంటనే రైతులు ఆ బసవన్నలను గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప గారి తిప్పే స్వామి, శివ, ఇన్నప్ప, జీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సంఘటన వ్యవసాయంలో యంత్రాలకంటే పశు సంపద అందించే శక్తి, వాటిపై రైతుల అభిమానం ఎంత గొప్పదో మరోసారి రుజువు చేసింది.

