ఆర్డీటీ సేవలకు సుగమనం: ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌కు కేంద్రం అంగీకారం

Malapati
0

 

ఉరవకొండ,ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 09: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ఆర్డీటీ పునరుద్ధరణ (రెన్యువల్) కోసం కేంద్రం అంగీకారం తెలపడంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది పేద లబ్ధిదారులు, బడుగు బలహీన వర్గాలలో ఉత్సాహం వెల్లివిరిసింది.

అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, దివ్యాంగుల సేవలు వంటి ఏ టు జెడ్ సేవలను అందిస్తూ ఆర్డీటీ సంస్థ మంచి ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ చర్యలను నిలిపివేయడంతో సేవలకు కొంతకాలం బ్రేక్ పడింది.

'మన జన ప్రగతి' పోరాటం కీలకం

ఆర్డీటీ సేవలకు ఎదురైన ఈ ఆటంకాన్ని 'మన జన ప్రగతి' దినపత్రిక ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. "ఆర్డీటీ సేవలకు బ్రేకులొద్దు.. ఎఫ్‌సీఆర్‌ఏ ముద్దు" మరియు "పేద బడుగు బలహీన వర్గాల సేవలో తరిస్తున్న ఆర్డీటీ సంస్థ సేవలకు కళ్లెం వేయవద్దు" అనే శీర్షికన కథనాలను ప్రచురించింది. పేద లబ్ధిదారులను మేలుకొలిపే ప్రయత్నంలో పత్రిక కీలక భూమిక పోషించింది.



ముఖ్యమంత్రులు, మంత్రుల జోక్యం

ఈ సమస్యను రాష్ట్ర అసెంబ్లీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో పాటు పలువురు తెదేపా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ స్పందించారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ సైతం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవడంలో కీలక పాత్ర పోషించారు.

అంతిమంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీటీకి తక్షణమే ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించాలని పేద ప్రజల నుంచి వచ్చిన ప్రభంజనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

దీంతో ఆర్డీటీ సేవా మార్గాలు తెరుచుకున్నాయి, లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నిర్ణయం పట్ల కృషి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మన జన ప్రగతి' దినపత్రిక హ్యాట్సాఫ్ తెలిపింది.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!