ఉరవకొండ/అనంతపురం ట్రూ టైమ్స్ ఇండియా, అక్టోబర్ 9 : ఉరవకొండ నియోజకవర్గం, ముఖ్యంగా పట్టణంలోని ప్రతి ప్రాంతంలో నిర్ణీత సమయంలో ప్రతి రోజు తాగునీటిని సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం అనంతపురం పట్టణం, రాంనగర్‌లోని తన కార్యాలయంలో ఆయన రూరల్ వాటర్ సప్లై (RWS) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి RWS ఈఈ శ్రీనివాసులు (అనంతపురం), ఆర్‌డబ్ల్యుఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజుమాన్ సఫ్రీన్, ఉరవకొండ సంబంధిత అధికారులు హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ –– నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారు చేసేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన పైపులైన్ల నిర్మాణం, ఓహెచ్‌ఎస్‌ఆర్ (ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్) ట్యాంకులు, కొళాయిలు వంటి అన్ని మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని నివేదికను సమగ్రంగా తయారు చేయాలని ఆదేశించారు.
నింబగల్లు ట్యాంకు నింపేందుకు చర్యలు
అలాగే, నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజి ట్యాంకును పూర్తిగా నింపడానికి అవసరమైన పంపింగ్ సౌకర్యం మరియు ట్రాన్స్‌ఫార్మర్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
"ఏ పరిస్థితుల్లోనూ గ్రామీణ ప్రాంతంలో తాగునీరు సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి," అని ఆయన RWS అధికారులను ఆదేశిస్తూ, నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని పునరుద్ఘాటించారు.

Comments
Post a Comment