ట్రూ టైమ్స్ ఇండియా
ఆల్మట్టి ఎత్తు పెంపుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం
కర్ణాటక కేబినెట్ ఇటీవల ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనుంది. డ్యామ్ పెంపునకు సంబంధించిన పునరావాసం, భూసేకరణ కోసం ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ. 70 వేల కోట్లు మంజూరు చేస్తూ కర్ణాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనికితోడు, ఇప్పటికే అదనంగా 5,30,475 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని అందించేలా కాలువల వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ఆల్మట్టిలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు పంపకుండా, అక్కడికక్కడే తరలించుకునేందుకు మార్గం సుగమం అయినట్లయింది.
శ్రీశైలం ఎడారిగా మారే ప్రమాదం: నిపుణుల హెచ్చరిక
కర్ణాటక తాజా చర్యల వల్ల అత్యంత కీలకమైన వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి కృష్ణా జలాలు చేరే అవకాశం దాదాపుగా ఉండదని జలవనరుల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది హెక్టార్ల ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని, ఈ ప్రాంత ప్రజలకు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు మౌనంపై నిరసన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రతిపాదనలు వచ్చినప్పుడే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో కూడా ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించకపోవడంపై నిపుణులు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు యుద్ధప్రాతిపదికన తీసుకుని ఉద్యమించాలని, దిగువ రాష్ట్రాల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల నేతలు కూడా మహారాష్ట్ర తరహాలోనే పోరాడాల్సిన అవసరం ఉందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.


Comments
Post a Comment