అనంతపురం జిల్లా, వజ్రకరూరు: క్యాన్సర్ వ్యాధిని ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే జయించగలమని చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీశ్ పేర్కొన్నారు.
వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలోని హెల్త్ వెల్నెస్ సెంటర్ నందు "క్యాన్సర్‌పై విజయం- స్క్రీనింగ్‌తో సాధ్యం" అనే అంశంపై బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీహెచ్‌వో విజయ్ కుమార్ మాట్లాడుతూ, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే రొమ్ము, నోటి, గర్భాశయ పరీక్షలు (సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్) తప్పనిసరిగా చేయించుకోవాలని, తద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మల్లెల జగదీశ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు వైద్యుల సూచనల మేరకు విధిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా క్యాన్సర్ వ్యాధిని జయించే విధంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను చేయించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్‌పీ పావని, ఆరోగ్య కార్యకర్త వరలక్ష్మి, మహిళా సంరక్షణ కార్యదర్శి అరుణ, ఆశా కార్యకర్తలు లింగమ్మ, మల్లికా, ధనలక్ష్మి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments
Post a Comment