అనంతపురం: నగరంలో బెస్త శరత్ ఏర్పాటు చేసుకున్న ఫిష్ మాల్ట్‌ను తొలగించకుండా చూడాలని కోరుతూ బెస్త సేవా సంఘం నేతలు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 'ఫిష్ ఆంధ్ర ఫిట్ఆంధ్ర' పథకంలో భాగంగా కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసుకున్న మాల్ట్‌ను సిరికల్చర్ అధికారులు తొలగించడానికి ప్రయత్నించడంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏడు లక్షల ఖర్చుతో ఏర్పాటు
గత ప్రభుత్వం చేపట్టిన "ఫిష్ ఆంధ్ర ఫిట్ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని సిరికల్చర్ కార్యాలయం ముందు బెస్త శరత్‌కు స్థలం కేటాయించారు. దీని కోసం శరత్ సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేసి మాల్ట్‌ను ఏర్పాటు చేసుకుని చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అధికారుల తొలగింపు యత్నం
అయితే, ఇటీవల సిరికల్చర్ ఆఫీసర్లు ఈ మాల్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేయడమే కాక, పోలీసుల సహాయంతో తొలగించడానికి ప్రయత్నించారు. దీనిపై ఆందోళన చెందిన బెస్త సేవా సంఘం నేతలు, మాల్ట్ యజమాని శరత్ సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు.
కలెక్టర్ జోక్యం
ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్, మాల్ట్‌ను తొలగించే అధికారం సిరికల్చర్ అధికారులకు లేదని స్పష్టం చేశారు. మాల్ట్‌ను తొలగించకుండా వారికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ సానుకూల స్పందనపై బెస్త సేవా సంఘం నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ, ఉపాధ్యక్షులు గంగప్ప, ట్రెజరర్ నాగేంద్ర, నాయకులు వెంకీ, ఎర్రి స్వామి, నారాయణస్వామి, మాల్ట్ యజమాని శరత్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment