ట్రంప్‌ సుంకాలపై సిపిఐ(ఎం) నిరంతర పోరాటం

Malapati
0


 

- సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు


భారతదేశాన్ని బెదిరించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాలపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తుందని సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 5,6 తేదీల్లో విజయవాడలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ”భారతపై ట్రంప్‌ సుంకాల యుద్ధం” అనే పుస్తకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కె.లోకనాధంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. 

బి.వి.రాఘవులు మాట్లాడుతూ.. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా 50శాతం పన్ను విధిస్తూ ఏకపక్షంగా ప్రకటించడం దారుణమని, రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నామని అదనంగా మరో 25శాతం పన్ను విధించడం మన సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు.

 ప్రజలకు అవసరమైన వాటిని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలో ఆ దేశం నిర్ణయించుకునే హక్కుందని, కానీ దీనికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశం ఎక్కడ, ఏం కొనాలో బెదిరించి, లొంగదీసుకునే స్ధితికి చేరుకోవడం గర్హనీయమన్నారు. దానికి ధీటుగా జవాబివ్వడంలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. 

అనేక చిన్న చిన్న దేశాలు చూపిన ధైర్యాన్ని, మన కేంద్ర ప్రభుత్వం చూపలేకపోవడం, అమెరికాకు అణిగిమణిగి ఉండేలా అవమానకరంగా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, అమెరికా సుంకాలను ప్రతిఘటించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి హితవు పలికారు.

 ఈ సుంకాల పెంపు వలన రాష్ట్రంలో ఆక్వా, ఆభరణాలు, ఆటోమొబ్కెల్స్‌ తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. లక్షలమంది ఉపాధి కోల్పోతున్న దుస్థితి నెలకొందన్నారు. హెచ్‌1బి వీసాలపై విధించిన ఆంక్షలు సైతం మరింత భయపెట్టేలా ఉన్నాయని, ఉన్నత చదువుల అనంతరం ఉపాధి కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇవి తీవ్ర ఆటంకంగా మారాయన్నారు. 

 మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో అంతా తెలుగువారే ఉన్నారని చెప్తుంటారని, కానీ హెచ్‌1బి వీసాలపై విధించిన ఆంక్షలపై మాత్రం నోరుమెదపడంలేదన్నారు. భారతీయ సినీ రంగంపై కూడా అమెరికా 100 శాతం పన్ను విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దానిపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడే స్థితిలో లేవన్నారు. అమెరికా ఎగుమతి చేస్తున్న వాటిపై మన దేశం పన్ను ఎత్తివేయాలని ఒత్తిడి తేవడం ఇంకా ప్రమాదకరమన్నారు. ఇదే కనుక జరిగితే రాష్ట్రంలో మొక్కజొన్న, పాడి, వ్యవసాయ ఉత్పత్తులు చేసే రైతులందరికీ తీవ్రమైన నష్టం కలుగుతుందని, దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి దీనిపై కనీసం ఉలుకుపలుకూ లేకుండా ఉండడం సరికాదన్నారు. బిజెపికి అడగకుండానే మద్దతిచ్చే జగన్‌ ఈ విషయంలోనైనా స్పందించాలన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!