ట్రాపికల్ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి బర్క్‌హోల్డేరియా సూడోమాలి (Burkholderia pseudomallei) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా మట్టి, నిల్వ నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు గాయాల ద్వారా, ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి శరీరంలోకి చేరాక, 48 గంటల్లోనే ప్రాణాంతక స్థితికి తీసుకువెళ్ళే ప్రమాదం ఉంది.
వైద్య నిపుణుల ప్రకారం, మెలియాయిడోసిస్ లక్షణాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. మొదటగా తీవ్ర జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత న్యుమోనియా, శ్వాసలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, లివర్ లేదా ప్రొస్టేట్‌లో అబ్బెస్‌లు (పుళ్ళు) ఏర్పడవచ్చు. కొంతమందిలో ఈ వ్యాధి సెప్సిస్ అనే తీవ్రమైన రక్త ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్‌కి అత్యంత సులభంగా గురవుతారని వైద్యులు చెబుతున్నారు. ఈ వర్గాల వారు మట్టి లేదా నిల్వ నీటితో నేరుగా సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరదల తర్వాత, తడిగా ఉండే ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుందని తెలిపారు.
మెలియాయిడోసిస్ నిర్ధారణకు రక్త పరీక్షలు, కల్చర్ టెస్టులు అవసరం. ప్రారంభ దశలో గుర్తిస్తే యాంటీబయాటిక్ మందులతో చికిత్స సాధ్యమే. అయితే ఆలస్యమైతే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తీవ్ర జ్వరం లేదా అసాధారణ న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments
Post a Comment