స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం
అభివృద్ధి అనేది హామీ కాదు – ఆచరణలో చేసి చూపిస్తున్నాం – మంత్రి సత్యకుమార్
బత్తలపల్లి, అక్టోబర్ 25:– ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలంలోని డి. చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు నిర్మించిన కొత్త బిటి రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,.... స్వతంత్రం వచ్చినప్పటినుండి రహదారి లేక ఇబ్బందులు పడుతున్న పత్యాపురం గ్రామం మరియు పత్యాపురం తండా ప్రజల అవసరాల నిమిత్తం ఈ బిటి రహదారి నిర్మించి, ప్రజల వినియోగానికి అందించడం నాకు ఆనందంగా ఉంది. ఈ రహదారి మొత్తం పొడవు 1060 మీటర్లు ఉండగా, ₹85.00 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేయబడింది. పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు ఈ బిటి రహదారి చాలా కాలంగా గ్రామ ప్రజల ఆకాంక్షగా ఉండేది. ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తికావడంతో తండా ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికీ నాణ్యమైన మౌలిక వసతులు అందించేందుకు కట్టుబడి ఉంది, అని మంత్రి తెలిపారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అనేది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు పంచాయతీరాజ్ శాఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు అందించడం మా ప్రధాన ధ్యేయం, అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, సర్పంచు రమాదేవి, బిజెపి బత్తలపల్లి మండల అధ్యక్షులు భాస్కర్, టిడిపి బత్తలపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, ఉప సర్పంచ్ సత్యం, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మేడ సారి అశోక్, కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment