ధర్మవరం, అక్టోబర్ 25:— ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో రెండు ముఖ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మొదటగా, ధర్మవరం ప్రాంతానికి చెందిన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 25 మంది రోగులను సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో మోకాళ్ల శస్త్రచికిత్స కోసం బెంగళూరులోని వైదేహి హాస్పిటల్‌కు ప్రత్యేక బస్సు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రోగులకు శస్త్రచికిత్స ఖర్చులు సహా అన్ని వైద్య సదుపాయాలను సంస్కృతి సేవా సమితి ట్రస్ట్ పూర్తిగా భరిస్తుంది. ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందించడంలో సంస్కృతి సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సేవ చేయడం ద్వారానే మనిషి జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమం మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కొత్త ఆశను కలిగిస్తుందని, రోగులు త్వరగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తరువాత అదే వేదికపై మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.61.55 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,... పేదలు, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యం బారిన పడినప్పుడు వారిపై భారంగా మారుతున్న వైద్య ఖర్చులను మేము గమనిస్తున్నాం. అందుకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధి మరియు ఎల్ఓసిల ద్వారా వైద్య సహాయాన్ని అందిస్తున్నాం. ఇప్పటికే ₹6.47 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాం. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యమైనది. కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ ఈ కార్యక్రమాల్లో వైదేహి హాస్పిటల్ డాక్టర్స్ లోకేష్ భరణి, శ్రేయాస్, సుచేంద్ర, నర్సింగ్ స్టాఫ్ సంకేష్, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment