తాడిమర్రి, అక్టోబర్ 21 :– ధర్మవరం ప్రజలు తనను ఎంతో నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారని, వారికి ఏ ఆపదొచ్చినా తాను అండగా ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా కల్పించారు. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన సాకే విగ్నేష్ ను మంత్రి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు పరామర్శించారు. సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పిన్నదరి గ్రామానికి చెందిన సాకే విగ్నేష్ (3 సంవత్సరాలు) అనే బాలుడికి గుండె సంబంధిత అత్యవసర చికిత్స అవసరం ఉండటంతో, మంత్రి చొరవతో తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బాలుడు విజయవంతంగా శస్త్రచికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు, మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం పిన్నదరి గ్రామానికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాబు ఆరోగ్యం క్షేమంగా ఉందని మంత్రి కి నివేదించారు. అనంతరం మంత్రి వెంటనే ఫోన్ కాల్ ద్వారా బాలుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా వారికి ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా హరీష్ బాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించారు . లేఖలో మంత్రి ఇలా పేర్కొన్నారు... మీ బాబు సాకే విగ్నేష్ తిరుపతి లోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో గుండె శాస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ చేయబడి మీ ఇంటికి చేరుకున్నారని శుభవార్త తెలుసుకొని నేను ఎంతో ఆనందించాను.
నామీద నమ్మకంతో ధర్మవరం శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన మీకు ఎంత సేవ చేసినా అది ఉడతా భక్తి సాయమే మీ బాబు పరిపూర్ణ ఆరోగ్యంతో పది కాలాలపాటు సంతోషంగా ఉండాలని నా ఆకాంక్ష.
మా సంస్కృతి సేవా సమితి మరియు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం మీకు ఎల్ల వేళలా వెన్నుదునుగా నిలుస్తాయి. మున్ముందు మీ కుటుంబం సంపూర్ణమైన ఆరోగ్యం ఆనందకర జీవితం గడపాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రామ్మోహన్, ధర్మవరం రూరల్ మండల అధ్యక్షులు చంద్ర, కూటమి నాయకులు విశ్వనాధ్, కేశవ నారాయణ, కిరణ్ కుమార్, సదా శివ, రమణ, రాజు, శ్రీనివాసులు, ఆకులేటి వీరనారప్ప, పోతుకుంట రాజు, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment