వజ్రకరూరు మన జన ప్రగతి : అక్టోబర్ 16 చిన్న హోతూర్:
రోజురోజుకు దేశంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, బాలిక కేవలం ఒక కుటుంబానికే కాదు, సమాజానికి భవిష్యత్తు అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DHEO) వేణుగోపాల్, ఆరోగ్య విస్తరణ అధికారి విజయకుమార్ ఉద్ఘాటించారు. అక్టోబర్ 11న నిర్వహించే అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమానత్వం వంటి అంశాలపై వారం రోజులపాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
విద్యావంతురాలైన బాలికే ఆరోగ్యవంతమైన తరానికి పునాది
ఈ సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్. పాఠశాల, చిన్న హోతూర్ నందు జరిగిన సదస్సులో వారు మాట్లాడుతూ... బాలికకు విద్య ఇవ్వడం అంటే భవిష్యత్తు తరాలను బలోపేతం చేయడమేనని తెలిపారు. చదువుకున్న అమ్మాయి ఆరోగ్యవంతమైన కుటుంబానికి, అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేస్తుందని అన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ కూతురిని తప్పకుండా పాఠశాలకు పంపాలని సూచించారు.
సమాన హక్కులే సమాజ అభివృద్ధికి తొలి అడుగు
ఆడపిల్ల తక్కువ అని అనుకోవడం పెద్ద తప్పు అని పేర్కొన్న అధికారులు, అవకాశం ఇస్తే బాలిక విజ్ఞానంలో, క్రీడల్లో, నాయకత్వంలో ముందుంటుందని చెప్పారు. సమాన హక్కులు ఇవ్వడం సమాజ అభివృద్ధికి తొలి అడుగు అని పేర్కొన్నారు. అంతేకాక, గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ తెలుసుకోవడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలు సమాజంలో అసమానతకు దారి తీస్తాయని హెచ్చరించారు. ప్రతి పుట్టుక దేవుని వరంగా భావించి దానిని గౌరవించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు రజినీ, పద్మజ, ఎం.ఎల్.హెచ్.పి. విజయలక్ష్మి, హెల్త్ సెక్రటరీ చాముండి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment