ఉరవకొండ, అక్టోబర్ 17:
అనంతపురం జిల్లా ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సమాచార హక్కు చట్టం (RTI) జిల్లా కార్యదర్శి మీనుగ మధు బాబు జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. పంచాయతీ తన పరిధిని దాటి అక్రమంగా అనుమతులు ఇస్తోందని ఆయన ఆరోపించారు.
పరిధి దాటిన పంచాయతీ అనుమతులు
మధు బాబు తెలిపిన వివరాల ప్రకారం, ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో G+2 (గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు) వరకు మాత్రమే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారం ఉంది. అయితే, అంతకు మించి నిర్మాణాలు చేపట్టాలంటే తప్పనిసరిగా అనంతపురం హౌసింగ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AHUDA) నుంచి అనుమతి పొందాలి.
రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ నిర్మాణం
అనంతపురం-బళ్లారి హైవే రహదారి, శ్రీ ఈశ్వరమ్మ దేవస్థానం పక్కన ఓ డాక్టర్ తన భార్య పేరిట బినామీగా బహుళ అంతస్తుల నిర్మాణం చకచకా సాగిస్తున్నారని మధు బాబు ఆరోపించారు. నిర్మాణదారుడు G+2 నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొని, ఆ ముసుగులో ఏకంగా సెల్లార్ ప్లస్ ఐదు (S+G+5) అంతస్తుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
నివాస యోగ్య భవనం కోసం అనుమతి పొంది, దీనిని వాణిజ్య అవసరాల (ప్రైవేట్ ఆసుపత్రి) కోసం నిర్మిస్తున్నట్లు మధు బాబు విమర్శించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ భవనం నిర్మించడం నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేశారు.
ముగ్గురిది ఒకే వర్గం: మిస్టరీ వెనుక మతలబు
పంచాయతీ తన అర్హతను మించి G+5 నిర్మాణానికి పరోక్షంగా అనుమతినివ్వడం వెనుక ఆర్థిక లా
వాదేవీలు జరిగి ఉంటాయని మధు బాబు అనుమానం వ్యక్తం చేశారు. నిర్మాణ అనుమతుల కోసం భారీగా లబ్ధి పొందినట్లు విమర్శించారు.
మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే, ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లానర్, గుత్తేదారు మరియు గ్రామ కార్యదర్శి ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లే అక్రమ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోందని, పంచాయతీ పాలకవర్గం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి
ఉరవకొండ పంచాయతీ పరిధిలో యాతేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ బహుళ అంతస్తుల భవన నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించాలని, చట్ట వ్యతిరేక నిర్మాణాలకు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని RTI జిల్లా కార్యదర్శి మీనుగ మధు బాబు జిల్లా ఉన్నతాధికారులను గట్టిగా డిమాండ్ చేశారు. AHUDA నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్న ఈ అక్రమంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు పెరిగిపోతాయని ఆయన హెచ్చరించారు.


Comments
Post a Comment