చూసి నవ్వాడన్న కోపంతో మైనర్ బాలుడి దారుణ హత్య.
October 10, 2025
0
రేణిగుంట, తిరుపతి జిల్లా:
రేణిగుంట మండలం గాజులమడ్యం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గువ్వల కాలనీలో మైనర్ బాలుడిని కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.
మృతుడు శ్రీహరి (14) గా పోలీసులు గుర్తించారు. స్థానిక టిఫిన్ దుకాణం వద్ద జరిగిన ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
పోలీసుల సమాచారం ప్రకారం, మేస్త్రిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉండగా శ్రీహరి తన వైపు చూసి నవ్వాడని కోపంతో ఆ బాలుడిపై దాడి చేశాడు. కోపావేశంతో మెడ, గుండెపై కత్తితో పొడిచి శ్రీహరిని రక్తమోడేలా చేశాడు.
స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మరణించాడు.
సూచన అందుకున్న గాజులమడ్యం పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
