-పోలీస్ సంస్మరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా బోయ గిరిజమ్మ
ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ అన్నారు. పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.
మంగళవారం (21.10.2025) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసు అమరవీరుల స్మారక స్తూపానికి పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ... అహర్నిశలు శ్రమించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖ త్యాగాలను కొనియాడారు. వారి సేవలకు జిల్లా ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమములో అనంతపురం జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, ఇతర పుర ప్రముఖులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

