– డీజీపీ, డీఐజీ, ఎస్పీ చేతగానితనంతోనే ఈ దుస్థితి
అనంతపురం వై సీ పీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి
గుత్తి, అక్టోబర్ 22 :
అధికార పార్టీ నేతల అరాచకాలపై వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి పట్ల మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుత్తిలో నిర్వహించిన ‘రచ్చబండ’లో అనంత మాట్లాడారు. తాడిపత్రిలో అమరవీరుల దినోత్సవం రోజే పోలీసుల సమక్షంలోనే ‘‘రేయ్ ఏఎస్పీ.. ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరేవాడిని’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించడాన్ని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకే కాదు.. చివరకు ఐపీఎస్‌లకూ రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. 24 గంటలు గడిచినా డీజీపీ, డీఐజీ, ఎస్పీ స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సాక్షాత్తూ ఏఎస్పీకే గతిలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల గౌరవాన్ని పెంచుతాం.. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవీరుల దినోత్సవం రోజున ప్రసంగించారని, అదే రోజు తాడిపత్రిలో ఒరేయ్ ఏఎస్పీ అంటుంటే ఇక మీరేం పోలీసుల గౌరవాన్ని పెంచుతారని మండిపడ్డారు. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు చీమునెత్తురు ఉంటే.. మీరు ఐపీఎస్ హోదాలో ఉన్నామని అనుపించుకోవాలంటే చట్టాన్ని తన పని చేసుకోనివ్వండి. అప్పుడే మీకు గౌరవం పెరుగుతుంది. లేకపోతే సామాన్యులు కూడా మిమ్మల్ని గౌరవించరు’’ అని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు.
*రైలు పట్టాలపై పడుకోబెడతానన్నా కేసు పెట్టరా?*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలలుగా అరాచక పాలన సాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ‘‘భూ కబ్జాలు, కల్తీ మద్యం అమ్మకాలు, ఎటుచూసినా పేకాట క్లబ్బులు.. తోటలు, లాడ్జిల్లోనూ పేకాట రాజ్యమే. పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేస్తే చివరకు ఆ బాలిక బిడ్డను ప్రసవించిన పరిస్థితి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే జర్నలిస్టులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారన్నారు. రైలు పట్టాలపై పడుకోబెడతానని బెదిరించినా ఒక్క కేసు నమోదు చేయలేదన్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మా పార్టీలోకి రండి.. వైసీపీ తరఫున నామినేషన్ కూడా వేయకూడదని గుంతకల్లు ఎమ్మెల్యే బెదిరిస్తే సీఎం స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఒక్కరు కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. చివరకు నిందితులను పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బయటకు తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏదైనా సమస్య వచ్చి స్టేషన్‌కు వెళితే కేసులు కూడా రిజిస్టర్ చేయరని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆస్తికే కాదు.. కుటుంబ సభ్యులకూ భద్రత లేదని అనంత మండిపడ్డారు.

Comments
Post a Comment