ధర్మవరం, అక్టోబర్ 24:— ధర్మవరం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే సంవాద్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ప్రజలతో పాటు రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ తరపున ప్రజల తరఫున పలు ముఖ్యమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హరీష్ బాబు మాట్లాడుతూ — గత కొన్ని సంవత్సరాలుగా గాంధీనగర్, శాంతినగర్, గుట్టకిందపల్లి, ఎల్-3, ఎల్-4 కాలనీల పరిసర ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్‌లలో వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్-3, ఎల్-4 కాలనీలకు బ్రిడ్జ్ యాక్సెస్ నిర్మాణం, స్టేషన్ పరిధిలో కోచ్ మోడల్ రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, అలాగే 5వ ప్లాట్‌ఫారమ్ వద్ద టికెట్ బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. హరీష్ బాబు ప్రతిపాదనలకు ప్రతిస్పందిస్తూ, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కోఆర్డినేషన్) శ్రీనివాస్ మాట్లాడుతూ — నవంబర్ నెలాఖరుకల్లా అండర్ బ్రిడ్జ్‌లలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. అవసరమైన సాంకేతిక చర్యలు ఇప్పటికే ప్రారంభించాం అని హామీ ఇచ్చారు.
స్టేషన్ మేనేజర్ చల్లా నరసింహనాయుడు ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో అధికారులు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాల విస్తరణ, అప్రోచ్ రోడ్ల మెరుగుదల, ఆర్చ్ నిర్మాణం వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందించారు. అధికారులు ప్రజల సూచనలను స్వీకరించి, ధర్మవరం రైల్వే స్టేషన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వడానికి రైల్వే శాఖ కట్టుబడి ఉందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ నరసింహనాయుడు, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ గోనుగుంట్ల సూర్యనారాయణ, రిటైర్డ్ కమర్షియల్ సూపరింటెండెంట్ మనోహర్ గుప్తా, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ, డాక్టర్ నరసింహులు, డి.ఆర్.యు.సి.సి. ఎక్స్ మెంబర్ బండి రాము, కమర్షియల్ సూపర్వైజర్ ముద్దన్న, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కిరణ్ కుమార్, చీఫ్ ట్రావెలింగ్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment