ఉరవకొండ: అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం పెంచిన సుంకాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీపావళి సందర్భంగా నరకాసుర వధ స్థానంలో ట్రంప్ విధించిన సుంకాలను నిరసిస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
ఈ నిరసనలో భాగంగా, ఉరవకొండ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ ఫ్లెక్సీని దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్నాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగం, పాడి, ఎగుమతి చేసే ఉత్పత్తులపై 11 నుంచి 50% వరకు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా దేశీయ వ్యవసాయ రంగం దివాళా తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులు పని దినాలు కోల్పోయి, పెద్ద ఎత్తున వలసలు పోవాల్సి వస్తుందని తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలు అవలంబిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం ప్రశ్నించకపోవడం 150 కోట్ల భారత దేశ ప్రజలను అవమానించడమేనని నేతలు మండిపడ్డారు.
బలవంతపు భూసేకరణ, 2013 చట్టం అమలుకై డిమాండ్
ఇదే సందర్భంగా నేతలు బలవంతపు భూసేకరణ, 2013 భూసేకరణ చట్టం అమలు గురించి కూడా డిమాండ్ చేశారు. 'అభివృద్ధి' పేరుతో రాష్ట్రంలో 32 కేంద్రాలలో సుమారు మూడు లక్షల ఎకరాల రెండు, మూడు పంటలు పండే భూములను ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపించారు. భూములు సేకరించే ప్రాంతాలలో 2013 చట్టాన్ని అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు.
వేలాది ఎకరాలు కార్పొరేట్లకు అప్పగిస్తుండటంతో ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికులు పనులు కోల్పోయి, ఉపాధి దెబ్బతిని వలసలు పోతున్నారని, కౌలుదారులు వీధి పాలవుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, బలవంతపు భూసేకరణను తక్షణమే ఆపాలని, 2013 చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, భూసేకరణ చేసిన ప్రాంతాలలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క వ్యవసాయ కార్మికుడికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments
Post a Comment