ఉరవకొండ :ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామ ప్రజలు తాము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరామని, కూడేరు సీఐ రాజు తమను బెదిరించారంటూ వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇటీవల పార్టీలో చేరిన ఈ గ్రామస్థులు శుక్రవారం విలేకరులకు ఈ వివరాలు తెలిపారు.
గత కొద్ది రోజుల క్రితం ముద్దలాపురం గ్రామ ప్రజలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, గురువారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అంతపురం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, కూడేరు సీఐ రాజు తమను పోలీస్ స్టేషన్‌కు పిలిచి, ఇబ్బందులకు గురిచేసి, బెదిరించి తెలుగుదేశం పార్టీలో చేరాలని పయ్యావుల శ్రీనివాసులును కలవమని చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ముద్దలాపురం గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసే చేరాం: కూడేరు సీఐ రాజు మమ్మల్ని పిలిచి పార్టీలో చేరాలని బెదిరించారనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేము స్వచ్ఛందంగానే ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీడీపీ పార్టీలో చేరాం" అని వారు తెలిపారు.
20 ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీలో ఉన్నా లబ్ధి లేదు: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తాము ఎస్సీ ప్రజలమని పేర్కొనడంపైనా గ్రామ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. "మేము గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్, వైసీపీ పార్టీలలో ఉన్నాం. అయినా మీ పార్టీలో మాకుగానీ, మా కుటుంబాలకు గానీ ఎటువంటి లబ్ధి పొందింది ఏమీ లేదు. మేము బీసీ కులానికి చెందిన వారము. అయినా మా కులం మీకు ఇంతవరకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మా కుటుంబాలు తెలుసుకొని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేపడుతున్న మంచి అభివృద్ధి కార్యక్రమాలను, మండలంలో, గ్రామాల్లో జరుగుతున్న పనులను చూసి, మా ఇష్టంతో, స్వతంత్రంగా పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాం" అని వివరించారు.
తప్పుడు ప్రచారం ఆపండి: పార్టీలో చేరే విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని, సీఐ రాజు బెదిరించారనే ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. "మా ఇష్టంతో మేము తెలుగుదేశం పార్టీలోకి చేరాము. దీనికి పయ్యావుల శ్రీనివాసులు కానీ, కూడేరు సీఐ రాజు కానీ, మాపై ఎవరి ప్రమేయం లేదు. మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు. అయ్యా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మాపై చిల్లర రాజకీయాలకు పాల్పడొద్దు" అని విలేకరుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment