రాయదుర్గం : రాయదుర్గం నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు యూరియా ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయదుర్గం పట్టణంలో జరిగిన విలేకర్ల సమావేశంలో సంఘం అధ్యక్షుడు నర్సింహులు, కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ — “ప్రభుత్వం నిర్ణయించిన యూరియా ధర రూ.280 మాత్రమే అయినప్పటికీ, కొన్ని షాపుల్లో రూ.350–400కు విక్రయిస్తున్నారు. అంతేకాక రైతులు యూరియా తీసుకోవాలంటే అదనంగా ఇతర ఎరువులు, మందులు కొనాలని షరతు పెడుతున్నారు. ఇది పూర్తిగా అక్రమం,” అని అన్నారు.
వారు మరింతగా మాట్లాడుతూ, “కనేకల్, గుమ్మగట్ట, బొమ్మనహాల్ మండలాల్లో యూరియా కొరతను సద్వినియోగం చేసుకొని కొందరు వ్యాపారులు రైతులపై దోపిడీ చేస్తున్నారు. స్థానిక ఏఓలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు,” అన్నారు.
గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో ఒక షాపు యజమాని రూ.400 ధరకు యూరియా విక్రయించడమే కాకుండా, అదనంగా మందులు కొనాలని రైతులను బలవంతం చేశారని ఆరోపించారు. దీనిపై సమాచారం ఇవ్వడానికి అధికారులు స్పందించకపోవడాన్ని రైతు సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
తక్షణమే తాళ్లకేరలోని ఫర్టిలైజర్ షాపులపై తనిఖీలు చేసి, అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం రాయదుర్గం ఏడి కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గంగాధర్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment