ఉరవకొండ, అక్టోబర్ 11: ఉరవకొండ మండలం, కౌకుంట్ల పంచాయతీలోని మైలారంపల్లి గ్రామంలో శివాలయానికి చెందిన భూమి కబ్జాకు గురవుతోందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ఒకటిన్నర ఎకరం భూమి కబ్జాకు గురికాగా, ఇప్పుడు రహదారి ముసుగులో మరో అర ఎకరం భూమి ఆక్రమించబడినట్లు గ్రామస్తులు, ధార్మికవాదులు ఆరోపిస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి:
శివాలయానికి చెందిన భూమిలో 8.04 ఎకరాలు ఉండగా, గ్రామానికి చెందిన వడ్డే లింగమయ్య అనే రైతు తాను కొనుగోలు చేసిన ముంపు భూమి పక్కన రహదారి పేరుతో అర ఎకరం శివాలయ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. .
ఇదిలా ఉండగా, పింజరి స్వామి అనే మరో రైతు గతంలోనే ఒకటిన్నర ఎకరం శివాలయ భూమిని కబ్జా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఈవోపై నిర్లక్ష్యం ఆరోపణలు:
శివాలయ భూమి కబ్జాపై స్థానికులు, భక్తులు దేవాలయాల సమూహ కార్యనిర్వహణ అధికారి (ఈవో) విజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి, కబ్జా నిరోధక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, ఈవో విజయ్ కుమార్ ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం:
దీంతో కొందరు ధార్మికవాదులు, రైతులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శివాలయ భూమి ఇలా కర్పూరంలా కరిగిపోవడంపై "ఓం నమశ్శివాయ" అంటూ భక్తులు ఆవేదనతో నినదిస్తున్నారు.


Comments
Post a Comment