బీహార్ పీఠం కోసం ఉత్కంఠ పోరు

0


బీహార్ రాజకీయం మళ్లీ ఉత్కంఠభరిత మలుపు దిశగా సాగుతోంది.                                                                                  
 రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ దిశే కాకుండా, ముగ్గురు ప్రధాన నేతల భవితవ్యాలు కూడా నిర్ణయంకానున్నాయి.

ఒకవైపు రెండు దశాబ్దాలుగా సుశాసన బాబు పేరుతో సింహాసనం కాపాడుకుంటున్న నితీశ్ కుమార్,

మరోవైపు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు తపనపడుతున్న యువ నేత తేజస్వి యాదవ్,

ఇంకోవైపు వ్యూహకర్తగా ఎన్నో విజయాలు సాధించిన ప్రశాంత్ కిశోర్ 

ఇప్పుడు ముగ్గురూ బీహార్ రాజకీయ రంగస్థలంలో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నారు.

నితీశ్ కుమార్: సుశాసన్ బాబుకు మళ్లీ సింహాసనం దక్కుతుందా?

దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్‌ను నడిపిస్తున్న జేడీయూ నేత నితీశ్ కుమార్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం.

74 ఏళ్ల వయసులో కూడా రాజకీయంగా చురుకుగా ఉన్న ఆయనకు ఈసారి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు "సుశాసన్ బాబు"గా పేరు గాంచిన నితీశ్, గత కొంతకాలంగా పొత్తుల మార్పులతో వార్తల్లో నిలుస్తున్నారు.

ఆయన ఆరోగ్యంపై వస్తున్న వీడియోలు, పార్టీ లోపలి అసంతృప్తి — ఇవన్నీ ఆయనపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

జేడీయూ-బీజేపీ కూటమికి ఆయనే సారథ్యం వహిస్తున్నప్పటికీ, ఈసారి మళ్లీ సీఎం అభ్యర్థిగా నిలుస్తారా?

లేకపోతే బీహార్ రాజకీయాల్లో నితీశ్ శకం ముగుస్తుందా? — అన్నది తేలాల్సి ఉంది.

తేజస్వి యాదవ్: యువనేత సవాల్ – వారసత్వ పోరాటం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని తన భుజాలపై మోస్తున్న తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల్లో గట్టి పరీక్షను ఎదుర్కొంటున్నారు.

తండ్రి అనారోగ్యం కారణంగా పార్టీ బాధ్యతలు పూర్తిగా ఆయనపై పడ్డాయి.

2020 ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా, అధికారాన్ని అందుకోలేకపోయింది.

అప్పటి నుండి ప్రజల్లో తిరిగి మద్దతు సంపాదించేందుకు తేజస్వి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

‘బీహార్ అధికార్ యాత్ర’ పేరుతో ప్రజల్లోకి వెళ్లిన తేజస్వి, యువతను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే బీజేపీ-జేడీయూ కూటమి బలమైన యంత్రాంగాన్ని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.

ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన బీహార్ యువరాజు నుంచి నిజమైన నాయకుడిగా అవతరించే అవకాశం ఉంది.

ప్రశాంత్ కిశోర్: వ్యూహకర్త నుంచి నాయకుడిగా – కొత్త ప్రయోగం

దేశంలో ఎన్నో నేతలకు విజయాలు అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఈసారి తనకోసమే బరిలోకి దిగుతున్నారు.

ఆయన స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీ ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేయనుంది.

2022లో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసి, గ్రామీణ ప్రాంతాల్లో పీకే బలమైన నెట్‌వర్క్ ఏర్పరచుకున్నారు.

సోషల్ మీడియాలో ఆయన పార్టీకి విపరీతమైన ప్రచారం లభిస్తోంది.

కానీ ఆ ప్రచారం ఓట్లుగా మారుతుందా? అన్నది తేలాల్సి ఉంది.

పీకే తన వైఖరిలో స్పష్టంగా ఉన్నారు — “రాజకీయాలు శుద్ధం కావాలి, ప్రజా భాగస్వామ్యం పెరగాలి” అంటున్నారు.

అయితే, ప్రధాన పార్టీలు ఆయనను తేలిగ్గా తీసిపారేయడం లేదు.

తీర్పు సమయం దగ్గరలోనే…

బీహార్ ప్రజలు ఈసారి ఎవరికి తీర్పు ఇస్తారు?

నితీశ్ తన అనుభవంతో మరోసారి సింహాసనం కాపాడుకుంటారా?

లేక తేజస్వి యువశక్తితో బీహార్ రాజకీయం కొత్త దిశలోకి వెళ్తుందా?

లేదా పీకే కొత్త శకానికి నాంది పలుకుతారా?

ఓటింగ్ బల్లెట్‌లు చెప్పే సమాధానమే బీహార్ రాజకీయ దిశను, దేశ రాజకీయ సమీకరణాలను మార్చబోతోంది.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!